
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు తెరపడింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణకు (Ceasefire) రెండు దేశాలు అంగీకరించాయి. ఈమేరకు భారత విదేశాంగశాఖతో పాటు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాలు స్పష్టం చేశారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాక్ (Indo Pak War) లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు.
భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ (Vikram Misri) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని చెప్పారు. పాకిస్థాన్ డీజీఎంఓ భారత డీజీఎంవోకు ఫోన్ చేసి మాట్లాడారని, కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారని చెప్పుకొచ్చారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అన్నారు. భూ, గగన, సముద్రతలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇరు దేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయని చెప్పిన మిస్త్రీ.. ఈ నెల 12 న సాయంత్రం డీజీఎంవోలు మరోసారి చర్చలు జరుపుతారని తెలిపారు.
భారత్-పాక్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (s jaishankar) ఎక్స్ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్, పాక్ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు.