Newspillar
Newspillar
Friday, 24 Oct 2025 00:00 am
Newspillar

Newspillar

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు మరో తుపాను (Storm) ముంపు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారం తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. ఈ అల్పపీడనం శనివారం నాటికి ఆగ్నేయ బంగాళఖాతం, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని చెప్పారు. ఇక ఆదివారం నాటికి అది తీవ్రవాయుగుండంగా రూపంతరం చెందుతుందని స్పష్టం చేశారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం, దానికి ప్రక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అందుకని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవ్వదని హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడనం, తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు, ఆదివారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం వెంట గంటకు 50-70 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటకు రావొద్దని, అందరు సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

25-10-25 శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 26-10-25 ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27-10-25 సోమవారం కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంచుకొస్తున్న తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారలను ఆదేశించారు. ఏ మాత్రం ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు.