Newspillar
Newspillar
Wednesday, 05 Nov 2025 18:30 pm
Newspillar

Newspillar

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆవేధన వ్యక్తం చేశారు. ఈ మధ్య వరుస ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుని 19 మంది సజీవ దహనం అయ్యారు.  శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తులు అనూహ్యంగా తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇటు తెలంగాణలోని చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 దుర్మరణం చెందారు. ఈ వరుస ప్రమాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సాంకేతికత అందుబాటులో ఉంటే కొంతవరకైనా ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు కర్నూలులో ప్రమాదానికి గురైన విషయాన్ని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రస్తావించారు. ఆ ప్రమాదానికి సంబంధించి సాంకేతిక, పాలసీ పరమైన లోపాలపై దృష్టి సారించామని తెలిపారు. కేంద్రం బస్సులకు నేషనల్ పర్మిట్ ఇస్తోందన్న సీఎం.. కానీ కర్నూలు ప్రమాదంలో చనిపోయిన వారు తెలుగువారని కామెంట్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో, వాహనం రిజిస్ట్రేషన్ ఒడిశాలో, ఆపరేషన్ తెలంగాణ నుంచి చేస్తోందని, గమ్యం స్థానం కర్ణాటకలో ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలని చంద్రబాబు ప్రశ్నించారు. 

కొన్ని రాష్ట్రాలు నామమాత్రపు ఫీజుతో వాహన రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నాయన్న చంద్రబాబు.. అలాంటి పర్మిట్లు ఉన్న వాహనాలు దేశమంతా తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా పాలసీల్లో ఉన్న లోపాల గురించి చర్చించకపోతే.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇక ఇటీవల తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాన్ని సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థ రెగ్యూలేటరీ అథారిటీ అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారని, ఒక ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ అలాంటి ప్రమాదం జరగకూడదన్నారు. మరి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.