Newspillar
Newspillar
Thursday, 22 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ డెస్క్- అట్లాంటిక్ సముద్రంలో గల్లంతైన టైటాన్‌ (Titan Submarine) మినీ జలాంతర్గామి విషాదంతో ముగిసింది. టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి శకలాలను గుర్తించారు. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల టైటాన్‌ జలాంతర్గామి పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని ప్రకటించింది. 488 మీటర్ల లోతులో టైటానిక్‌ ఓడ సమీపంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్‌ కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ మౌగర్‌ చెప్పారు. ఆమెరికా కోస్ట్‌ గార్డ్‌, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

111 ఏళ్ల క్రితం అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయి 12 వేల అడుగుల లోతులోని టైటానిక్‌ (Titanic) నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో మినీ జలాంతర్గామి టైటాన్‌ గత ఆదివారం న్యూఫౌండ్‌ ల్యాండ్‌ నుంచి బయలుదేరింది. యూఏఈలో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌ , ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి వీరి ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్‌లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠ రేపింది.

రెస్క్యూ సిబ్బంది సముద్రంలో గాలింపు చేపట్టినప్పటికీ టైటాన్ మినీ జలాంతర్గామి జాడ కనిపించలేదు. గురువారం సాయంత్రం రిమోట్‌ ఆపరేటేడ్‌ వెహికల్‌  సహాయంతో టైటానిక్‌ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. దీంతో టైటాన్ లోని ఐదుగురు మరణించారని స్పష్టం చేసింది. ఈ ఐదుగురు వ్యక్తులు నిజమైన అన్వేషకులు.. ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగిఉన్నారు.. ప్రస్తుత ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచనలు ఉన్నాయి.. ఈ ఘటనకు చింతిస్తున్నాం.. అని ఓషన్‌ గేట్‌ సంస్థ సంతాపం ప్రకటించింది.