Newspillar
Newspillar
Friday, 07 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణలో మరో రైలు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘచన చోటుచేసుకుంది. హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌ నుమా ఎక్స్‌ప్రెస్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ముందు ఎస్4, ఎస్5 బోగీల్లో దట్టమైన పొగలు వస్తున్నట్లు ప్రయాణికులు, సిబ్బంది గుర్తించి వెంటనే లోకోపైలట్‌ కు సమాచారం అందించారు. దీంతో రైలును పగిడిపల్లి, బొమ్మాయిపల్లి మధ్య అత్యవసరంగా నిలిపివేశారు. భయాందోళనలతో ప్రయాణికులంతా కిందికి దిగిపోవడంతో ఎలాంచి ప్రాణనష్టం జరగలేదు. 

ఎస్ 4, ఎస్ 5 నుంచి మంటలు క్రమంగా మొత్తం ఆరు బోగీలకు వ్యాపించాయి. 5 బోగీలు పూర్తిగా దగ్ధం కాగా, ఒక బోగీ పాక్షికంగా కాలిపోయింది.  రైల్వే సిబ్బంది బోగీల మధ్య లింక్‌ ను వేరు చేసి, రైలును ముందుకు తీసుకెళ్లడంతో మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా నిలువరించారు. ఫైర్ ఇంజిన్ లు అక్కడి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కొంత ఆలస్యంగా అక్కడికి చేరుకున్నాయి. బోగీలకు అంటుకున్న మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ లగేజి, ఇతర వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయని ఆవేదన చెందారు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్తుండగా తన సర్టిఫికెట్లన్నీ రైలులో ఉండిపోయాయని ఓ యువతి కన్నీరుపెట్టుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను అక్కడి నుంచి హైదరాబాద్‌ కు తరలించేందుకు ప్రత్యేకంగా 6 బస్సులు ఏర్పాటు చేశారు. మిగతా ప్రయాణికులను సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన లోకమాన్య తిలక్‌ రైలులో సికింద్రాబాద్ తరలించారు. 

ఇక సమగ్ర విచారణ తర్వాతే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గల కారణాలు చెప్పగలమని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ అన్నారు. అంతే కాదు ఇప్పుడు జరిగి ప్రమాదానికి, ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మరో వారం రోజుల్లో ఒడిశా తరహా ఘోర రైలు ప్రమాదం జరగబోతోందంటూ ఓ ఆగంతకుడు ఇటీవల దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. బెదిరింపు లేఖపై విచారణ జరుగుతోందని సీపీఆర్వో రాకేశ్‌ తెలిపారు.