Newspillar
Newspillar
Tuesday, 25 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

 
మూవీ రిపోర్ట్-  హైదరాబాద్‌ లో మంగళవారం నిర్వహించిన బ్రో (BRO) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పాటు మెగా హీరోలు వరుణ్‌తేజ్‌ (Varun Tej), వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఆవెంట్ లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సందడి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని, భగవంతుడు ఇలా నడిపిస్తున్నాడని చెప్పారు పవన్. నటుడిని కావాలని, రాజకీయ నాయకుడిని అవ్వాలని తాను ఎప్పుడూ అనుకోలేదని కామెంట్ చేశారు. 

బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. బ్రో వేడుకకు వచ్చిన మా కుటుంబానికి (అభిమాలను ఉద్దేశిస్తూ) హృదయ పూర్వక నమస్కారం. ఇంత ప్రేమ, అభిమానం సినిమానే నాకు ఇచ్చింది. నా ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే అంశం ఉండాలని కోరుకుంటా. ఈ సినిమాలో ఆ అంశం పూర్తిస్థాయిలో ఉంటుంది. కరోనా సమయంలో ఈ సినిమా గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పారు. రచయిత, దర్శకుడిని నేను వంద శాతం నమ్ముతా. సముద్రఖని (Samuthirakani) రాసిన మూల కథకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే అందించారు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అద్భుతంగా రాశారు.

ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ramcharan) లా నేను గొప్ప డ్యాన్స్‌ చేయలేకపోవచ్చు. ప్రభాస్‌ (Prabhas), రానా (Rana) ల బలమైన పాత్రలను పోషించలేకపోవచ్చు. కానీ సినిమా అంటే నాకు ప్రేమ. సమాజం అంటే బాధ్యత. ఈ చిత్ర పరిశమ్ర ఏ ఒక్క కుటుంబానికీ చెందింది కాదు. ఇది అందరిది. రాజకీయం కూడా అంతే. మేమంతా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. స్టార్‌ డమ్‌ సాధించిన తరువాత.. నువ్వు హీరో అవుతావా? అని అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) నన్ను అడిగారు. ఆ ప్రశ్నకు నాకు భయమేసింది. ఎందుకంటే నా ఊహలో హీరో అంటే చిరంజీవినే. ఎప్పుడూ నన్ను నేను హీరోగా ఊహించుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పొలంలో పనిచేయాలని ఉండేది. మా వదిన నాలో మార్పు తీసుకొచ్చారు. మనల్ని నమ్మేవారు ఒకరుండాలి. 

విశాఖపట్నం జగదాంబ సెంటర్‌లో బస్‌ పై షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు సిగ్గేసింది. నలుగురిలో నటించలేక ఏడుపొచ్చింది. మా వదినకు ఫోన్‌ చేసి.. నువ్వెందుకు నన్ను సినిమాల్లోకి పంపించావ్‌? అని అడిగాను. ఆ రోజు మా వదిన చేసిన తప్పు.. ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. ఆమె చేసిన ద్రోహం గురించి మాటల్లో చెప్పలేనని నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.

తాను మొరటు మనిషినని.. తనకు తెలిసిదల్లా త్రికరణ శుద్ధితో పనిచేయడమేనని.. అదే కోట్లాది అభిమానుల్ని సంపాదించి పెట్టిందని అన్నారు పవన్. ఒకే కుటుంబం నుంచి ఇంత మంది హీరోలు వచ్చారంటే చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు.. కానీ మేమంతా గొడ్డు చాకిరి చేస్తామని అన్నారు. ‘బ్రో’  సాయిధరమ్‌ తేజ్‌ తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇది. కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్లు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.