Newspillar
Newspillar
Friday, 28 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ఈ మధ్య కాలంలో విదేశీ ప్రేమలు ఎక్కువయ్యాయి. మొన్న భారత్ లోని ప్రియుడి కోసం పాకిస్థాన్ (Pakistan) నుంచి ఏకంగా తన నలుగురు పిల్లలతో సీమా హైదర్‌ (Seema Haider) రాగా, నిన్న పాకిస్థాన్ లోని ప్రియుడి కోసం పెళ్లైన మహిళ పాకిస్థాన్ వెళ్లిన ఘటన కలకలం రేపుతుండగా ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రేమకు ఎల్లలు లేవని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు కోవలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చోటుచేసుకుంది. ఫేస్‌ బుక్‌లో పరిచయమైన ప్రియుడి కోసం శ్రీలంక (Srilanka) కు చెందిన ఓ యువతి పర్యాటక వీసాపై వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంది. చిత్తూరు (Chittur) జిల్లా వి.కోట మండలం ఆరిమాకులపల్లెకు చెందిన శంకరప్ప కుమారుడు లక్ష్మణ్‌ (Lakshman) తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.

ఇతనికి  శ్రీలంకలోని బేలంగూడు ప్రాంతానికి విఘ్నేశ్వరి (Vegneshwari) తో ఫేస్‌ బుక్‌లో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది వీరిద్దరు సుమారు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో విఘ్నేశ్వరి పర్యాటక వీసాతో ఈనెల 8వ తేదీన చెన్నై కి వచ్చింది. లక్ష్మణ్‌ అక్కడికి వెళ్లి ఆమెను ఆరిమాకులపల్లెలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. లక్ష్మణ్‌ కుటుంబ సభ్యుల అంగీకారంతో వాళ్లిద్దరు జులై 20న వి.కోటలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఐతే పర్యాటక వీసాపై వచ్చిన ఆమె వి.కోట మండలంలో ఉందన్న సమాచారంతో జిల్లా ఎస్పీ మూడు రోజుల కిందట వారిని చిత్తూరుకు పిలిచించినట్లు సమాచారం. ఆగస్టు 6న ఆమె వీసా గడువు ముగుస్తుందని, అప్పటిలోగా తిరిగి శ్రీలంక వెళ్లిపోవాలని ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది.