
స్పెషల్ రిపోర్ట్- ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ (Engineering Counselling) నిర్వహించాలని తెలంగాణ (Telangana) ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న తుది విడత కౌన్సెలింగ్ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుగుతాయని విద్యాశాఖ కార్యదర్శి, కన్వినర్ వాకాటి కరుణ (Vakati Karuna) తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు.
ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. తుది విడతలో ఈనెల 4న స్లాట్ బుకింగ్, 5న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 4 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి, 9న తుది విడత సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 9 నుంచి 11 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 17న స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 17 నుంచి 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి, 23న సీట్లు కేటాయిస్తారు. స్పాట్ ప్రవేశాల కోసం అదే రోజున మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వాకాటి కరుణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.