Newspillar
Newspillar
Sunday, 06 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

 హైదరాబాద్ రిపోర్ట్- ప్రజా వాంగ్మయకారుడి గుండె ఆగిపోయింది. ఉద్యమ గళం మూగబోయింది. తన పాట, ఆటతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక (Praja Yuddha Nouka) నింగికేగింది. ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) (76) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో అమీర్‌పేట అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మూడు గంటల ప్రాంతంలో  తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ శివారు అల్వాల్‌ లోని ఇంటిదగ్గర జులై 20న గద్దర్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌ పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి తరలించగా. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు గద్దర్. గుండెలో సమస్య ఉండటంతో డాక్టర్లు ఈ నెల 3న వైద్యులు బైపాస్‌ సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంటూ హుషారుగా పాటలు కూడా పాడిన గద్దర్, త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి చెప్పారు.

ఐతే అనూహ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆదివారం మధ్యాహ్నం గద్దర్ ఆరోగ్యం విషమించింది. వైద్యులు అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్‌ ను ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. ప్రజా యుధ్ద నౌక గద్దర్‌ 1947 ఆగస్టు 4న మెదక్‌ జిల్లా తూప్రాన్‌ లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావ్‌ (Gummadi Vittal Rao). నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ లలో ప్రాథమిక, ఉన్నత విద్యతో పాటు ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. 1975 లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగం వదిలి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు గధ్దర్ కు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ఉన్నాకు. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఎన్నో ప్రజా ఉద్యమాలను గధ్దర్ ముందుండి నడిపించారు.  

జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. గధ్దర్ పలు సినిమాల్లో పాటలు రాయడంతో పాటు నటించారు. పీపుల్స్‌వార్‌ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌ పై హత్యాయత్నం జరిగింది. అభిమానుల సందర్శనార్థం గద్దర్‌ పార్థివదేహాన్ని ఎల్‌బీ స్టేడియానికి తరలించారు. అక్కడికి ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. గద్దర్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవితాంతం సమాజానికి ఆయన చేసిన త్యాగాలకు, ప్రజాసేవకు సూచికగా ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజాక్షేత్రంలో పాటల తూటాలు కురిపించిన ప్రజా గాయకుడు గద్దర్‌ సినిమా రంగంపైనా కూడా తనదైన ముద్ర వేశారు. బండెనక బండి కట్టి... (మాభూమి), భద్రం కొడుకో... (రంగులకల), ఆగదు ఆగదు... ఈ ఆకలి పోరు ఆగదు... (అడవి బిడ్డలు), భారతదేశం భాగ్యసీమరా.. సకల సంపదలకి కొదువలేదురా.. (దండకారణ్యం) మల్లెతీగకు పందిరివోలె మసక సీకటిలో వెన్నెలవోలె.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... (ఒరేయ్‌ రిక్షా), పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా (జై బోలో తెలంగాణ).. ఇలా ఎన్నో పాటలతో రచయితగా, గాయకుడిగా, నటుడిగా మారి సినిమాల ద్వార ప్రజలను ప్రభావితం చేశారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి దర్శక నిర్మాణంలో రూపొందిన ఒరేయ్‌ రిక్షా’సినిమాలోని అన్ని పాటల్నీ గద్దర్‌ రాశారు. ఆ సినిమాలోని మల్లెతీగకు పందిరివోలె... పాటకి ఉత్తమ గేయ రచయితగా గద్దర్‌ కీ, ఉత్తమ గాయకుడిగా వందేమాతరం శ్రీనివాస్‌ లకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు ప్రకటించింది అంతే కాదు జై బోలో తెలంగాణ సినిమాలోని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పాటకి కూడా ఉత్తమ గాయకుడిగా నంది అందు కున్నారు. ఐతే విప్లవ ఉద్యమంలో ఉన్నవారు ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలకీ, బహుమతులకి దూరంగా ఉండాలనే నియమంతో అవార్డులను తిరస్కరించారు గధ్దర్. Gaddar No More