
స్పెషల్ రిపోర్ట్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఐఐటీ (IIT Hyderabad) హైదరాబాద్ లో విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలిస్తుండటం తల్లిదండ్రులతో పాటు అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం ఐఐటీహెచ్ విద్యార్థి విశాఖపట్నంలో సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే తాజాగా మరో విధ్యార్ధిని మమైత నాయక్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఐఐటీహెచ్ లో 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడుగురు బలవనర్మణాలకు పాల్పడటం గమనార్హం. బలవనర్మణాలకు పాల్పడిన వారిలో ఆరుగురు అబ్బాయిలు కాగా, ఒక అమ్మాయి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విధ్యార్ధులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సోమవారం రాత్రి తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థిని మమైత నాయక్ (21) (Mamaitha Nayak) సొంతూరు ఒడిశా రాష్ట్రంలోని దుంగ్రీ గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ విధ్యార్ధిని జులై 26న ఎంటెక్ కోర్సులో చేరింది. సోమవారం మధ్యాహ్నం కడుపు నొప్పిగా ఉందని స్నేహితులకు చెప్పిన ఆమె తన గదిలోనే ఉండిపోయింది. ఐతే భోజనం చేసేందుకు సైతం రాకపోవడంతో తోటి స్నేహితులు రాత్రి 8:30 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో అనుమానంతో హాస్టల్ వార్డెన్, సిబ్బందితో కలిసి ఆమె గదికి వెళ్లారు. గదిలో గడియ పెట్టుకుని ఉండటంతో ఐఐటీహెచ్ కి సంబంధించిన వైద్యులు, స్నేహితుల సమక్షంలో తలుపు తీశారు. అప్పటికే ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది.
నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను మానసిక ఒత్తిడికి గురవుతున్నా.. అంటూ యువతి రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వృద్ధాప్యం కారణంగా ఆమె తల్లిదండ్రులు రాలేని పరిస్థితి ఉండటంతో హైదరాబాద్ లింగంపల్లిలో నివాసముంటున్న బంధువులు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి వచ్చారు. మమైత నాయక్ ఉరేసుకున్న నైలాన్ తాడు ఎక్కణ్నుంచి వచ్చిందో చెప్పాలని పోలీసులను మిగతా వారిని ప్రశ్నిస్తున్నారు.