
ఇంటర్నేషనల్ రిపోర్ట్- సూడాన్ లో ఆకలిచావులు (Sudan) ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణాతి దారణంగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కధనాలు చెబుతున్నాయి. ఘర్షణలు ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 500 మంది చిన్నారులు ఆకలితో (Hunger) చనిపోయినట్లు స్థానిక సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. మరోవైపు 31వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఇక ఘర్షణల నేపధ్యంలో లక్షలాది మందికి నీరు, విద్యుత్ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.
సూడాన్ లో (Sudan conflict) ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయిందని సమాచారం. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనతో వివాదం నెలకొంది. అది కాస్త ఆర్మీ- పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఏప్రిల్ 15న మొదలైన ఈ అంతర్యుద్ధంలో సుమారు 4వేల మంది మృతి చెందినట్లు ఐక్య రాజ్య సమితి (UNO) వర్గాలు తెలిపాయి. కానీ ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘర్షణల నేపధ్యంలో దాదాపు 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు, పక్కన ఉన్న దేశాలకు వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సూడాన్ లో పరిస్థితులు సద్దుమణిగేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.