Newspillar
Newspillar
Friday, 01 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- సింగపూర్ (Singapore) కు మన దేశ సంతతి వ్యక్తి అధ్యక్షుడయ్యారు. భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) (66) సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. శుక్రవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు థర్మన్‌ షణ్ముగరత్నం కు దక్కాయి. పోలైన మొత్తం 20,48,000 ఓట్లలో మాజీ మంత్రి షణ్ముగరత్నంకు మద్దతుగా 70.4 శాతం ఓట్లు అంటే 17,46,427 పడ్డాయి. ఆయన సమీప ప్రత్యర్థులైన చైనా సంతతి అభ్యర్థులు ఎన్జీ కాక్‌ సాంగ్‌ (Ng Kok Song) కు 15.72 శాతం, టాన్‌ కిన్‌ లియాన్‌ (tonkon leone) కు 13.88 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితాలతో సింగపూర్‌ కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్‌ లూంగ్‌ (Lee Hsien Loong) షణ్ముగరత్నం కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (PAP) ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నంకు మద్దతు ఇచ్చింది. 

సింగపూర్‌ (Singapore) కు 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్‌ షణ్ముగరత్నం 2011 నుంచి 2019 దాకా సింగపూర్‌ ఉప ప్రధానిగా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు సీనియర్‌ మంత్రిగా సింగపూర్ మంత్రివర్గంలో పనిచేశారు. షణ్ముగరత్నం సింగపూర్‌ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957 లో పుట్టారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్‌.రామనాథన్‌, దేవన్‌ నాయర్‌ సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు.