Newspillar
Newspillar
Friday, 01 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఓఎస్డీ 108 అంబులెన్స్ సర్వీసుల మహిళా ఉద్యోగిపై చేయి చేసుకోవడం వివాదాస్పదమవుతోంది. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఛాంబర్‌ ఎదురుగా ఉన్న 108 కాల్‌ సెంటర్‌ ఉద్యోగిపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) ఓఎస్డీ, ఆరోగ్యశ్రీ అదనపు సీఈఓ మధుసూదన రెడ్డి (Madhusudhan Reddy) చేయిచేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే మధుసూదన రెడ్డి చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ సుమారు 15 నిమిషాలపాటు 108 సిబ్బంది అత్యవసర కాల్స్‌ తీసుకోవడం ఆపేసి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్సు రాకలో ఆలస్యం కారణంగా రైలు ప్రమాద బాధితుడు మరణించినట్లు వచ్చిన వార్తపై గురువారం సీఎం కార్యాలయం వివరణ కోరింది.

దీంతో మధుసూదన రెడ్డి హడావుడిగా 108 కాల్‌సెంటర్‌ (108 call centre) లోని ఉద్యోగి వద్దకు వెళ్లి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించావంటూ దురుసుగా మాట్లాడటంతో పాటు ఆమెపై చేయిచేసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు సుమారు వంద మంది వరకు చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వివాదాస్పమైంది. మంత్రి ఓఎస్డీ దురుసు ప్రవర్తనకు నిరసనగా సహచర సిబ్బంది కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫోన్లను 15 నిమిషాలపాటు తీసుకోలేదు. దీంతో అధికారులు జోక్యం చేసుకొని సిబ్బందికి నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై మధుసూదనరెడ్డికి మెమో ఇవ్వాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసరంగా కాల్‌ చేసిన వారికి సమాధానం ఇవ్వడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఉద్యోగిని నిలదీసే క్రమంలో భావోద్వేగానికి గురయ్యానని మధుసూదన రెడ్డి వివరణ ఇచ్చారు. ఐతే ఈ ఘటనపై ఇంతవరకు మంత్రి విడదల రజిని స్పందించలేదు.