
హైదరాబాద్ రిపోర్ట్- హైదరాబాద్ (Hyderabad) లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బిచానా ఎత్తేసింది. సాఫ్ట్ వేర్ లో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని సదరు సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బిజినేపల్లి ప్రేమ్ ప్రకాష్ (Prem Prakash) హైదరాబాద్ కు వలస వచ్చాడు. సనత్ నగర్‌లో నివాసం ఉంటూ స్నేహితుడు లిఖిత్‌తో (Likhith) కలసి సంవత్సరం క్రితం కొండాపూర్ వెస్ట్రన్ పెరల్ భవనంలో సంటూ సూ ఇన్నోవేషన్స్ (sant su innovations) పేరిట ఐటీ కంపెనీ మొదలుపెట్టారు.
తమ కంపెనీలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉద్యోగం కఇస్తామని ఒక్కో నిరుద్యోగి వద్ద లక్ష నుంచి లక్షన్నర వరకు డబ్బులు వసూలు చేశారు. అలా తమ కంపెనీలో చేరిన వారికి ముందు రెండు నెలల పాటు సరిగ్గానే జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏవో సాకులు చెబుతూ జీతాలు ఇవ్వడం మానేశారు. కంపెనీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. నిందితులు నిరుద్యోగుల నుంచి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు నిందితులు ప్రేమప్రకాష్, లిఖిత్ లను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.