
హైదరాబాద్ రిపోర్ట్- సాధారణంగా మొసల్లను నదుల్లో, పెద్ద పెద్ద సరోవరాల్లో చూసుంటారు. కానీ హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఓ మొసలి (Crocodile) పిల్ల హల్ చల్ చేసింది. అవును మీరు చదువుతుంది నిజమే. హైదరాబాద్ లోని ఓ నాలా ఒడ్డున మొసలి పిల్ల కలకలం రేపింది. ఖైరతాబాద్ లోని చింతలబస్తీ దగ్గర కొత్త వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో బల్కాపూర్ నాలా ఉద్ధృతిలో ఈ మొసలి పిల్ల కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
వరదతో పాటు వచ్చిన మొసలిని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొసలిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులతో పాటు అటవీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్లు చేసినా చాలా సేపు ఎవరూ స్పందించలేదని చింతలబస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలా సమీపంలోనే ఇళ్లు ఉన్నాయని, రాత్రి ఆ మొసలి ఎక్కడికి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. నాలాపై వంతెన నిర్మాణ పనులు మూడు నెలలైనా పూర్తి కాకపోవడం, అక్కడే మొసలి కనిపించడంతో బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పక్కనపెడితే నగరం నడిబొడ్డున మొసలి వచ్చిందన్న సమాచారం తెలుుసుకున్న చుట్టుపక్కల కాలనీ వాసులు మొసలిని చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.