
నెల్లూరు రిపోర్ట్- అన్న ప్రేమ కోసం తమ్ముడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నిపింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరి గ్రామానికి చెందిన కాకార్ల నాదముని అలియాస్ నిరంజన్ కు, రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన ఓ యువతి ఏడాది క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇంతలో తన తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేయబోతున్నారని నిరంజన్ కు సమాచారం ఇచ్చింది యువతి. దీంతో తన తమ్ముడు కాకర్ల దేవేంద్ర (22)ను పంపిస్తున్నానని, అతనితో వచ్చేయమని చెప్పాడు నిరంజన్.
అన్న చెప్పడంతో యువతి ఇంటికి వెళ్లి నంబర్ ప్లేట్ లేని స్కూటీలో యువతిని తీసుకొని కాకర్ల దేవేంద్ర స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యలో బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద జాతీయ రహదారి ఆకాశవంతెన సమీపంలో నిద్రమత్తులో ఉన్న దేవేంద్ర డివైడర్ ను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో యువతితో పాటు అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108 కు సమాచారమిచ్చారు. అంబులెన్స్ లో కావలి ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా అప్పటికే దేవేంద్ర మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. గాయపడిన యువతి చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా అన్న ప్రేమ కోసం తమ్ముడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.