Newspillar
Newspillar
Friday, 29 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

న్యూ డిల్లీ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు (Nara Lokesh) ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్టోబరు 4న ఉదయం 10 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ కింద ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నాపు. నారా లోకేశ్‌ ప్రస్తుతం దిల్లీలోని అశోకా రోడ్‌ లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ (Galla Jayadev) ఆఫీస్ లో ఉండగా, సీఐడీ అధికారులు దిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేశ్‌ కు అక్కడే నోటీసులు ఇచ్చారు.

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌ మెంట్‌ వ్యవహారంపై గత సంవత్సరం ఏపీ సీఐడి (AP CID) నమోదు చేసిన కేసులో ఏ14 గా నారా లోకేశ్‌ పేరును ఇటీవల చేర్చారు. ఈ క్రమంలో హైకోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌ కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌  ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబరు 4న ఉదయం 10 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో నారా లోకేశ్ విచారణకు కానున్నారని తెలుస్తోంది.