
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో పాటు కలిశారు లోకేశ్. చంద్రబాబుతో భేటీ తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు లోకేశ్. పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్ కు పంపారని ఈ సందర్బంగా అన్నారు. జగన్ ప్రభుత్వ తప్పులు బయటపెట్టి, ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబును 28 రోజులుగా రిమాండ్ లో పెట్టారని ఆవేధన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు 3 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారని, ఆ తరువాత 300 కోట్లు అని ఆరోపించారని చెప్పారు లోకేశ్.
న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ, ఖచ్చితంగా న్యాయం తమ వైపే ఉంటుందని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరన్న లోకేశ్.. రిమాండ్ లో ఉంచినా ఆయన అధైర్య పడలేదని తెలిపారు. పోరాటం ఆపవద్దని, శాంతియుతంగా పోరాడాలని మాతో చెప్పారని అన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లతో చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని లోకేశ్ పిలుపునిచ్చారు. మా కుటుంబం మొత్తాన్ని వైసీపీ (YCP) ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చిందని వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు భద్రతపై ఆందోళన ఉందని లోకేశ్ అన్నారు. రాజమహేంద్రవరం జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖ రాశారని గుర్తు చేసిన లోకేశ్.. కొందరు జైలుపై నుంచి డ్రోన్ ఎగరేశారని చెప్పారు. రాజమహేంద్రవరం జైలులో కొంతమంది నక్సల్స్, గంజాయి అమ్మేవారు ఖైదీలుగా ఉన్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో నిరసన చేస్తామని, గడప గడపకు బాబుతో నేను కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు లోకేశ్.