
విజయవాడ రిపోర్ట్- ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber Net) కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ (ACB Court) కోర్టు అనుమతించింది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఐతే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి. దీంతో సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.