Newspillar
Newspillar
Friday, 10 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- తెలుగు సినిమా సీనియర్ నటుడు చంద్ర మోహన్‌ (82) (Chandramohan) కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చంద్రమోహన్ మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  నాలుగేళ్ల నుంచి చంద్రమోహన్‌ గుండె సంబందింత సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటుండగా కిడ్నీలపై కూడా ప్రభావం పడటంతో శనివారం ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.45 గంటలకు చంద్రమోహన్ కన్నుమూశారు.

చంద్రమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. చంద్రమోహన్ బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదివారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు చంద్రమోహన్. తెలుగు, కన్నడంతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు చంద్రమోహన్. హీరోగానే కాకుండా కమెడియన్, చాలా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. చంద్రమోహన్ తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో చంద్రమోహన్ నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 

చంద్రమోహన్‌ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలున్నారు. దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్‌కు చంద్రమోహన్‌ సమీప బంధువు. ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌నగర్‌ లోని తన నివాసానికి చంద్రమోహన్‌ పార్థివదేహాన్ని తరలించారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం తర్వాత చంద్రమోహన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు కృష్ణప్రసాద్‌ చెప్పారు.