Newspillar
Newspillar
Tuesday, 14 May 2024 18:30 pm
Newspillar

Newspillar

బాపట్ల రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్‌ లోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో అగ్ని ప్రమాదానికి గురైంది. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. మొత్తం 40 మంది ప్రయాణికులతో బయలుదేరగా.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌ ను కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌తో పాటు బస్సుకు మంటలు వ్యాపించాయి. (Bapatla Bus Fire Accident)

ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్ తో పాటు మరో నలుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మందికి పైగానే తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్సులు, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత నేపధ్యంలో చిలకలూరిపేట తో పాటు యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 అంబులెన్సులను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన 20 మంది ప్రయాణీకులను బయటకు తీసి అంబులెన్లులలో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు.

చిలకలూరిపేట నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ బస్సుకు అంటుకున్న మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారేనని తెలుస్తోంది.  బైపాస్‌ రోడ్డుకు సంబందించిన పనులు జరుగుతుండటం, బీటీ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడంతో టిప్పర్‌ అతి వేగంగా రావడం.. టిప్పర్‌ డ్రైవర్ స్పీడ్ ను కంట్రోల్ చేయకపోవడమనే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.