Newspillar
Newspillar
Thursday, 23 May 2024 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో నిందితులకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. జూన్‌ 6 వరకు వారిని అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో ఉపశమనం పొందినవారిలో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సైతం ఉన్నారు. తాడిపత్రి వైసైపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌ రెడ్డిలకు కూడా అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. 

వచ్చే నెల జూన్‌ 4న ఓట్ల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉందని, పోటీలో ఉన్న అభ్యర్థులు కౌటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్న నేపధ్యంలో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు చేసిన అభ్యర్థనతో హైకోర్టు ఏకీభవించింది. షరతులతో పిటిషనర్లకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఐతే అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని షరతు విధించారు. వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. 

అంతే కాకుండా సాక్షులను బెదిరించకూడదని, కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు కోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులిస్తున్నట్లు న్యాయ మూర్తి తెలిపారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలుచేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను జూన్‌ 6కి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి. మరోవైపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకూ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని అక్కడి వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు షరతు విధించింది కోర్టు.