
తెలంగాణలో గ్రూప్-2 (Group 2) పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. వచ్చే నెల ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూలు చేస్తూ టీజీపీఎస్సీ (TGPSC) ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి గ్రూప్-2 పరీక్షలను డిసెంబరు నెలలో నిర్వహిస్తామని, పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అంతే కాకుండా డీఎస్సీకి, గ్రూప్-2 పరీక్షలకు మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే అభ్యర్ధులతో సమావేశమై పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలు ఇప్పటికే మొదలయ్యాయి. సీఎం సూచన మేరకు శుక్రవారం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అభ్యర్ధుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షను డిసెంబరు లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. ఈ మేరకు పరీక్షల వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ టీజీపీఎస్సీకి సూచించింది సర్కార్.
దీంతో వెంటనే పోటీ పరీక్షల మధ్య వ్యవధి తక్కువ ఉన్న నేపధ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. మొత్తం 783 పోస్టులతో 2022లో గ్రూప్-2 ప్రకటన వెవచ్చింది. అప్పుడు 5.51 లక్షల మంది అప్లై చేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. గురుకుల టీచర్ ఉద్యోగాల పరీక్షలతో గ్రూప్-2 కు సన్నద్ధం కాలేకపోయామని అభ్యర్ధులు కోరడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేసింది.
ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవ్వడంతో గ్రూప్-2 పరీక్షలు మరోసారి 2024 జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి, కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక ఈ యేడాది 2024 ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఇదిగో మళ్లీ ఇప్పుడు డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో మరోసారి డిసెంబరుకు వాయిదా పడింది.