
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ సారి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ప్రకటించడంతో ఆయన సతీమణి ఉషా చిలుకూరి (usha chilukuri) పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే ఉషా చిలుకూరి భారతీయ మూలాలున్న కుటుంబం నుంచి వచ్చారు. అందులోను మన తెలుగు వారని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉషా చిలుకూరికి మన విశాఖపట్నంలో బంధువులున్నారు. తొంభై ఎళ్ల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు రీసెర్చ్ చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష చిలుకూరి మనవరాలి వరుస అవుతారు.
శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసి కొన్నాళ్ల క్రితమే చనిపోయారు. చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కొడుకు రాధాకృష్ణ కూతురే ఉష చిలుకూరి. జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగిందని చెప్పారు. తమ బంధుత్వం గురించి తెలిశాక చాలా మంది బంధువులు, స్నేహితులు ఫోన్‌లో శుభాకాంక్షలు చెబుతున్నారని తెలిపారు శాంతమ్మ. ఐతే ఉష దంపతులు మన దేశంలో ఉండి ఉన్నతస్థాయికి వెళ్తే మరింత గర్వంగా ఉండేదన్నారు.
ఆమెరికా ఎన్నికల్లో వాన్స్ తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఉష, వాన్స్ ను విశాఖపట్నం కు ఆహ్వానిస్తామని చెప్పారు శాంతమ్మ. ఇక వాన్స్, ఉషల పెళ్లికి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు చెన్నైలో డాక్టర్ గా పనిచేస్తున్నా ఉష మేనత్త శారద. ఉషా చిలుకూరి మూలాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహన రావు ఫ్యామిలీ ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటోంది. ఉష చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచని దీన్ని బట్టి తెలుస్తోంది..