Newspillar
Newspillar
Saturday, 20 Jul 2024 00:00 am
Newspillar

Newspillar

రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తెస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అచెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్ల తరహాలో తీర్చిదిద్దడంతో పాటు అక్కడే మూడో తరగతి వరకు విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో విద్యా బోధనకు ఒక టీచర్‌ను నియమించాలనే ఆలోచన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సెక్రెటరియేట్ లో విద్యా వేత్తలు, రిటైర్డ్ అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యారంగ బలోపేతం, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణపై చర్చించారు. ఈ బేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రొఫెసర్లు కోదండరాం, జానయ్య, హరగోపాల్, పద్మజా షా, శాంతా సిన్హా, విశ్వేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు ఆకునూరి మురళి, లక్ష్మీనారాయణ తదితరులు హజరయ్యారు. తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుకున్నామని ఈ సందర్బంగా సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. 

విద్యావ్యవస్థ బలోపేతానికి ఆర్ధిక బడ్జెట్‌ ను పెంచుతామని చెప్పిన సీఎం.. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పిల్లలు చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గురుకుల పాఠశాలలకు సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కొనసాగిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. విద్య, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో కమిషన్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.