Rupee

ఆల్‌టైం కనిష్ఠానికి మన రూపాయి

మరింత పడిపోయిన రూపాయి విలువ

బిజినెస్ రిపోర్ట్- మన రూపాయి (Rupee ) విలువ రోజు రోజుకు దిగజారుతోంది. వరుసగా నాలుగో రోజూ రూపాయి క్షీణించింది. రికార్డుస్థాయిలో లైఫ్ టైం కనిష్ఠానికి చేరింది. గురువారం ట్రేడింగ్‌ లో డాలరుతో పోలిస్తే 10 పైసలు కోల్పోయి 83.23 వద్ద ముగిసింది. విదేశీ మూలధన పెట్టుబడులు బయటకు వెళ్లడం, అంతర్జాతీయంగా అమెరికన్‌ కరెన్సీ బలోపేతం కావడం ఇందుకు కారణాలని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సెంటి మెంటును దెబ్బతీసిందని ఫారెక్స్‌ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.  

చమురు తయారీ దేశాలు డిసెంబరు వరకూ సరఫరా కోతను కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో చమురు ధర పీపాకు 90 డాలర్లను అధిగమించింది. వీటి ప్రభావంతో గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌లో మన దేశీయ కరెన్సీ డాలరుతో పోలిస్తే 83.15 వద్ద మొదలైంది. 83.12 నుంచి 83.23 మధ్య ట్రేడ్ అయ్యింది. ఆఖరికి జీవితకాల కనిష్ఠమైన 83.23 వద్ద క్రోజ్ అయ్యింది. అంతక్రితం రోజు రూపాయి 9 పైసలు కోల్పోయి 83.13 వద్ద ముగిసింది. సోమవారం నుంచి గురువారం వరకు దేశీయ యూనిట్‌ 61 పైసలు కోల్పోయింది. ఈ నాలుగు రోజుల్లో వరుసగా 9, 33, 9, 10 పైసల చొప్పున క్షీణించింది. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు పెరుగుతాయి. అందులో ప్రధానంగా చమురు అంటే పెట్రోల్, డీజిల్ లాంటి బిల్లులు పెరుగుతాయి.


Comment As:

Comment (0)