Aditya L1 ISRO

ఆదిత్య ఎల్‌ 1 గురించి ఇస్రో కీలక అప్ డేట్

భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసిన ఆదిత్య ఎల్‌1 

నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో (ISRO) సూర్యుడి పై పరిశోధనల కోసం ప్రయోగించిన ‘ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహం తన లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఇస్రో శనివారం కీలక అప్ డేట్ ప్రకటించింది. ఆదిత్య- ఎల్-1 వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని ఇస్రో తెలిపింది. ఆదిత్య- ఎల్-1 భూ గురుత్వాకర్షణ పరిధి (Sphere of Earth's Influence)ని విజయవంతంగా దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆదిత్య- ఎల్-1 లెగ్రేంజ్‌ పాయింట్‌ 1 (Lagrange Point 1) వైపు ప్రయాణిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. లెగ్రేంజ్‌ పాయింట్‌ 1 భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇస్రో ఆదిత్య- ఎల్-1 భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి విజయవంతంగా పంపడం ఇది వరుసగా రెండవసారి. అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ తొలిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్‌-3 సక్సెస్ తర్వాత ఆదిత్య ఎల్‌1 ను ప్రయోగించింది ఇస్రో. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక సెప్టెంబరు 2న నింగిలోకి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లింది. లెగ్రేంజ్‌ పాయింట్‌ 1 వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉండటంతో, ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆదిత్య-ఎల్‌1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. 


Comment As:

Comment (0)