CM KCR

రుణమాఫీ పక్రియ ఆగస్టు 3 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్- ఆగస్టు 3 నుంచి రైతు రుణమాఫీ

స్పెషల్ రిపోర్ట్- ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) తెలంగాణ (Telangana) రైతులకు తీపికబురు చెప్పారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీ (Farmer loan waiver) ప్రక్రియను ఆగస్టు 3 నుంచి ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వ్యవసాయ సంబందిత అంశాలతో పాటు రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌ లో సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్బంగా కేసీఆర్‌ అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు. నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడిన ఆర్ధిక మందగమనం, కరోనా వల్ల రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యల వల్ల రైతు రుణమాఫీ ఆలస్యానికి కారణమని ఈ సందర్బంగా సీఎం తెలిపారు. 

తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌, సాగునీటి పథకాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి గుర్తు చేశారు.  ఇప్పటివరకు కొంత మేర పూర్తి చేసిన రైతు రుణమాఫీ పోను, మరో 19వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ డబ్బులు రైతులకు అందించాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బంధు తరహాలో విడతలవారీ రుణమాఫీ చేస్తూ.. నెలన్నర లోపు అంటే సెప్టెంబరు రెండో వారం నాటికి రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Comment As:

Comment (0)