BRS List

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి

ఈనెల 21న బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా?

స్పెషల్ రిపోర్ట్- వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై అధికార బీఆర్ఎస్ ()BRS పార్టీ కసరత్తు పూర్తిచేసింది. ఈ మేరకు ఈనెల 21న అభ్యర్ధులకు సంబందించిన మొదటి జాబితాను ప్రకటించేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) సిద్దమైనట్లు సమాచారం. సెంటిమెంట్ ప్రకారం ముందుగా ఈ నెల 18న అభ్యర్థుల జాబితాను (BRS Candidates List) విడుదల చేయాలని అనుకున్నా.. అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. మరింత కసరత్తు తరువాత ఈనెల 21న మొదటి దశ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. అందుకే 21న అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు.

2018లో 105 శాసనసభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించారు. ఐతే ఈసారి మాత్రం మొదటి విడతలో సుమారు 80 నుంచి 85 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్‌ రెండో స్థానంగా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీలో ఉంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో అభ్యర్థులెవరినీ మార్చకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉండకపోవచ్చని, మిగతావారందరికి  డోకా లేదని తెలుస్తోంది, ఈ జిల్లాలో ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఓ నేతకు టికెట్‌ ఇస్తారని సమాచారం.

అటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా ఒకటి రెండు నియోజకవర్గాలకు మార్పులకే అవకాశం ఉన్నట్లు సమాచారం. డోర్నకల్‌ నుంచి రెడ్యానాయక్‌ లేదా ఆయన కుమార్తె, మహబూబాబాద్‌ ఎంపీ కవిత.. ఇద్దరిలో ఎవరో ఒకరు అనే ప్రచారం జరిగినా చివరకు రెడ్యానాయ క్‌నే పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చనట్లు తెలుస్తోంది. ఇక మహబూబాబాద్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ లేదంటే మంత్రి సత్యవతి రాథోడ్‌ లలో ఒకరికి అవకాశం కల్పించనున్నారు. జనగామలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చితే ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక స్థానంలో మాత్రమే మార్పు చేయనున్నారని తెలుస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మార్పుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఇల్లెందు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కుమార్తె, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయకళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న అనూరాధ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన హరిప్రియ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఈసారి ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని కొన్నాళ్ల క్రితమే బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బుధవారం రాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ సమావేశమైనప్పుడు కూడా ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. వైరా నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది తర్వాత బీఆర్ఎస్ లో చేరిన రాములునాయక్‌ ను కూడా ఈ ఎన్నికల్లో మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి మదన్‌ లాల్‌కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈనెల 21న మొదటి జాబితా ప్రకటించనున్న నేపధ్యంలో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారందరిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి మొత్తం 10 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. BRS Candidates First List
 


Comment As:

Comment (0)