Newspillar
Newspillar
Tuesday, 27 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

హెల్త్ డెస్క్- ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఉదయం టిఫిన్ చేయడం మానేస్తున్నారు. మరి కొందరైతే  ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉపవాసం విషయంలో జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం తినటం మానేస్తే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని తగ్గించుకుంటున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. మౌంట్‌ సినానీలోని ఇక్హాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎలుకలపై నిర్వహించిన తాజా అధ్యయనం ఇదే చెబుతోంది. ఉపవాసానికీ నాడులు, రోగనిరోధక వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో బయటపడింది. 

కొన్ని గంటల పాటు, లేదంటే ఒకరోజు పాటు అంటే 24 గంటల పాటు ఉపవాసం చేయటం రోగనిరోధక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవటం కోసం పరిశోధకులు దృష్టి సారించారు. కొన్ని ఎలుకలకు లేచిన వెంటనే ఆహారం ఇచ్చి, మరికొన్ని ఎలుకలను ఉపవాసం ఉంచారు. అలాగే లేచిన వెంటనే, నాలుగు గంటల తర్వాత, ఎనిమిది గంటల తర్వాత రక్తనమూనాలు సేకరించారు. ఉపవాసం ఉన్న ఎలుకల్లో మోనోసైట్స్‌ అనే తెల్ల రక్తకణాల సంఖ్యలో గణనీయమైన తేడాలను గమనించారు. ఎముక మజ్జ నుంచి తయారయ్యే ఈ కణాలు శరీరమంతటా తిరుగుతూ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం వంటి కీలకమైన పనులు చేస్తాయి. ఈ మోనోసైట్స్ గుండెజబ్బు, క్యాన్సర్లలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. 

ముందు అన్ని ఎలుకల్లోనూ మోనోసైట్ల సంఖ్య సమానంగానే ఉండగా, ఉపవాసం చేసిన ఎలుకల్లో నాలుగు గంటల తర్వాత గణనీయంగా తగ్గిపోయింది. రక్తంలోంచి మోనోసైట్లు 90 శాతం వరకు మాయమయ్యాయి. ఎనిమిది గంటల తర్వాత మరింత వాటి సంఖ్యం మరింత తగ్గిపోయిందని నిపుణులు గుర్తించారు. ఈ మోనోసైట్స్ అన్ని తిరిగి ఎముకమజ్జకు చేరుకొని, నిద్రాణస్థితికి వెళ్లిపోయాయని తేల్చారు. దీంతో ఎముకమజ్జలో కొత్త కణాల ఉత్పత్తి తగ్గిపోయింది. మళ్లీ ఒక రోజు తర్వాత ఎలుకలకు ఆహారం ఇవ్వగా అప్పటివరకు ఎముకమజ్జలో దాచుకున్న మోనోసైట్లు కొద్దిగంటల్లోనే మళ్లీ రక్తంలోకి వచ్చాయి. దీంతో ఇన్‌ఫ్లమేషన్‌ పెద్ద మొత్తంలో తలెత్తింది. 

ఉపవాసంతో మెదడులో ఒత్తిడి ప్రతిస్పందన తలెత్తటం వల్ల ఆకలితో కూడిన కోపాన్ని ప్రేరేపిస్తున్నట్టూ నిపుణులు గుర్తించారు. తెల్ల కణాలు ఉన్నట్టుండి రక్తంలోంచి ఎముకమజ్జలోకి, తిరిగి మజ్జలోంచి రక్తంలోకి వెళ్లిపోవటానికి ఇదే దోహదం చేస్తోందని తేల్చారు. ఉపవాసంతో జీవక్రియల పరంగా మంచి ప్రయోజనాలు ఉండటం నిజమే ఐనా.. అన్నీ లాభాలే ఉంటాయని అనుకోవటానికి లేదని చెబుతున్నారు. అందుకే ఉదయం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.