Newspillar
Newspillar
Monday, 24 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

 పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) లో శాసనసభ ఎన్నికల (Assembly Elections 2023) కు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ సర్వేలు, పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడో వారంలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. సర్వేల తరువాత ఎక్కువ మంది అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా అప్రతిష్ఠపాలుకావడం, నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత ఉందనుకొన్న వారి స్థానాలను మినహాయించి మిగతా చోట్ల మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో పార్టీ తరఫున విజయం సాధించిన వారితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో కలిసి ప్రస్తుతం బీఆర్ఎస్ కు మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక జరగలేదు. వీటితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మరో 15 నియోజకవర్గాలు కలిపి మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పార్టీ తరఫున గెలిచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారి నియోజకవర్గాల్లో, ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వారున్న నియోజకవర్గాల్లో అక్కడ ఓడిపోయిన వారి నుంచి అభ్యర్థిత్వం కోసం పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా ఎలాంటి ఇబ్బంది లేని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనే అభిప్రాయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు సమాచారం. మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించాలని కొన్నాళ్ల క్రితం వరకు భావించినా.. రెండు విడతల్లోనే తేల్చేయాలని తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందనుకుంటున్న స్థానాల్లోనే చివరి వరకు ఆగాలని, మిగతా నియోజకవర్గాల అభ్యర్ధులను మొదటి జాబితాలోనే ప్రకటించాలని బీఆర్ఎస్ యోచనగా తెలుస్తోంది.