Newspillar
Newspillar
Wednesday, 20 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women's Reservation Bill) బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ (Arjun Ram Meghwal) 19 న పాత పార్లమెంట్ భవనంలోని లోక్ సభలో ప్రవేశపెట్టగా, బుధవారం ఈ బిల్లుపై చర్చ జరిగింది. సుమారు ఎనిమిది గంటలపాటు చర్చ తరువాత న్యాయశాఖ మంత్రి ఈ బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్ సభలో మొత్తం 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 

లోక్ సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. సభ్యులందరికీ ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను  అందజేశారు. ఓటింగ్‌ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్‌ ఎంపీలకు వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్‌’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలని, బిల్లును వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై నో అని రాయాలని తెలిపారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఓటింగ్‌ కు కొద్దిసేపటి ముందు ప్రధాని మోదీ (PM Modi) సభలోకి వచ్చారు. మొత్తం మీద చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.