Newspillar
Newspillar
Tuesday, 28 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- అందరి ప్రార్ధనలు ఫలించాయి. నిపుణులు, ఆర్మీ, సిబ్బంది చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఉత్తరాఖండ్‌ లో సిల్‌ క్యారా వద్ద సొరంగం నుంచి కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. దీంతో మొత్తం 17 రోజుల ఉత్కంఠకు, నిరీక్షణకు తెరపడింది. ఉత్తరాఖండ్ లోని చార్‌ ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌ క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో ఉండగా కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయారు. మొత్తం దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో ఆ కార్మికులను రక్షించేందుకు అత్యాధునిక యంత్రాలను ఉపయోగించారు. అంతే కాదు విదేశీ నిపుణులను రప్పించారు. కార్మికులను సొరంగం నుంచి బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు 17 రోజుల పాటు అలుపెరగకుండా పనిచేశాయి.

చిక్కుకుపోయిన చోట సొరంగంలో తిరుగాడడానికి రెండు కిలో మీటర్ల  మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించడంతో కూలీలు క్షేమంగానే ఉన్నారు. ఇలా మొత్తం 17 రోజుల పాటు కార్మికులు సొరంగంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించడంతో కార్మికులు బయటకు వచ్చారు. కూలీలు బయటకు వస్తున్నప్పుడు అక్కడంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ప్రధాని మోదీ వల్లనే ఈ మిషన్ విజయవంతం అయ్యిందని కామెంట్ చేశారు. సొరంగం బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక మందిరం దగ్గర స్థానికులు పూజలు నిర్వహించారు. 

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, బీఆర్‌వో, సైన్యంలోని ఇంజినీరింగ్‌ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వంటివి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. చాలా ప్రయత్నాల తరువాత చివరికి సన్నని మార్గం ద్వారా బొగ్గును బయటకు తీసుకువచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్నవాటిని వారు విజయవంతంగా తొలగించారు. అప్పటికే సిద్దం చేసిన గొట్టపు మార్గం నుంచి ఒక్కొక్కరు పాకుతూ బయటకు రావడం సజావుగా సాగిపోయింది. సొరంగం వద్ద ఒకరినొకరు అభినందించుకున్నారు. కార్మికులను అప్పటికే సిద్దం చేసిన అంబులెన్స్ లలో వైద్య చికిత్సకు తరలించారు.