Newspillar
Newspillar
Thursday, 11 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

కడప రిపోర్ట్- ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్ షర్మిల (YS Sharmila) ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు గొడవకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనుకూలంగా వైసీపీ జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఐతే పోలీసులు స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

ఇక కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని వైఎస్ షర్మిల అన్నారు. అందుకే తన ప్రచారాన్ని, పర్యటనలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తాను ఒకప్పుడు జగన్‌కి చెల్లెలు కాదు.. బిడ్డను అని చెప్పిన షర్మిల, ఆయన సీఎం అయ్యాక జగన్‌తో తనకు పరిచయం లేదని చెప్పుకొచ్చారు. బాబాయిని చంపిన వాళ్లను పక్కన పెట్టుకున్నాడని మండిపడ్డారు.

అవినాష్‌ అంటే మాకు ఇదివరకు కోపం లేదని చెప్పిన షర్మిల.. అతడు హంతకుడని సీబీఐ తేల్చిందని, అన్ని ఆధారాలు బయటపెట్టిందని అన్నారు. హత్య చేసిన అవినాష్ రెడ్డిని జగన్‌ కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాశ్ రెడ్డికి శిక్ష పడకుండా జగన్ అడ్డుపడుతున్నారని.. హంతకులకు జగన్‌ అండగా నిలబడినందుకే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు.

అల్లరి చేసే వాళ్లు పులివెందులకు రండి.. పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదాం.. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం.. అని సవాల్ విసిరారు షర్మిల. హంతకులు మరోసారి చట్టసభల్లోకి వెళ్లొద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన షర్మిల.. న్యాయం-ధర్మం ఒకవైపు, అన్యాయం-హంతకులు ఒక వైపు అని కామెంట్ చేశారు.