ISRO Chandrayaan

ఇస్రో కమాండ్స్ కు స్పందించని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ లు

చంద్రయాన్‌-3 కధ ఇక ముగిసినట్లే- ఇస్రో మాజీ ఛైర్మన్‌

స్పెషల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం-ఇస్రో (ISRO) చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander), ప్రజ్ఞాన్‌ రోవర్‌లు (Pragyan Rover) ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. గత నెల సెప్టెంబర్‌ 22న జాబిల్లిపై సూర్యోదయమైనప్పటికీ ల్యాండర్‌, రోవర్‌ లు ఇంకా మేల్కొవడం లేదు. ఇస్రో వాటిని మేల్కొలిపేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ సందర్బంగా ఇస్రో మాజీ ఛైర్మన్‌, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ (AS Kiran Kumar) చంద్రయాన్‌-3 ప్రాజెక్టుపై స్పందించారు. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ లు మేల్కొవడంపై ఇక ఆశ కనిపించడం లేదని ఆయన అన్నారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు కధ ఇక ముగిసేనట్లేనని ఆయన కామెంట్ చేశారు. 

చంద్రయాన్‌-3 ని విశాల దృక్కోణంలో చూసినప్పుడు అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందన్న కిరణ్ కుమార్.. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై చంద్రయాన్‌ కాలుమోపిందని చెప్పారు. ఇప్పటికే ఆ అక్కడి నుంచి విలువైన సమాచారం మనకు అందిందని.. ఇది కచ్చితంగా ఉపయోగపడే సమాచారమేనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రయాన్ -3 ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం తనకు లేదని చెప్పారు.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న చందమామ దక్షిణ ధ్రువం చేరడంతో ఇస్రో కీర్తి పతాకాల్లో నిలిచింది.

విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. ఆ తరువాత జాబిల్లి దక్షిణ ధృవంపై చీకటి కావడంతో సెప్టెంబర్‌ 2న రోవర్‌, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 22న అక్కడ మళ్లీ సూర్యోదయం కావడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఇప్పటి వరకు విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ లు ఇస్రో పంపించే కమాండ్ లకు స్పందించడం లేదు. దీంతో రోజు రోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.


Comment As:

Comment (0)