సినిమా పిల్లర్- బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఆ తరువాత సైతం ఒకటి రెండు సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు. ఇదిగో ఇప్పుడు మళ్లీ కాశి తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి కాశి సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా..
సినిమా- కాశి
నిర్మాత- ఫాతిమా విజయ్ అంటోని
దర్శకత్వం- కృతిగ ఉదయనిధి
సంగీతం- విజయ్ అంటోని
తారాగణం- విజయ్ అంటోని, అంజలి, నాజర్, జయప్రకాశ్, సునయన తదితరులు.
న్యూస్ ప్ల్లర్ రేటింగ్- 3/10
కాశి పరిచయం.....
గతంలో బిచ్చగాడు సినిమా విజయంతో విజయ్ ఆంటోని తెలుగు వాళ్లకు బాగా గుర్తుండిపోయాడు. విజయ్ నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా ఉదయనిధి దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటించిన సినిమా కాశి. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భావోద్వేగాలకు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి పెద్ద పీత వేసినట్లు ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో విజయ్ అంటోని చెప్పారు.
కాశి సినిమా కధ.......
భరత్ (విజయ్ అంటోని) అమెరికాలో పెద్ద డాక్టర్. సొంత హాస్పిటల్, హోదా, మంచి కుటుంబం అన్నీ ఉన్నా భరత్ కు ఏదో చెప్పలేని వెలితి ఉంటుంది. ఓ చిన్న బాబుని ఎద్దు పోదిచినట్లుగా కల చిన్నతనం నుంచి భరత్ ను వెంటాడుతుంది. ఇక హఠాత్తుగా తన తల్లి కిడ్నీలు ఫెయిల్ అవడంతో భరత్ జీవితం కీలక మలుపు తిరుగుతుంది. ఇన్ని రోజులు అమ్మానాన్నలు అనుకున్న వారు తనను పెంచిన తల్లితండ్రులు మత్రమే అని తెలుస్తుంది భరత్ కు.
దీంతో తనకు రోజు వచ్చే కలకు తన గతానికి ఏదో సంబంధం ఉన్నదన్ననిర్ణయానికి వచ్చిన భరత్.. తనను కన్న తల్లి తండ్రులని వెతుక్కుంటూ ఇండియాకి వస్తాడు. అనాథశ్రమంలో తన తల్లిపేరు పార్వతి అని, ఆమె సొంత ఊరు కంచెర్లపాలెం అని తెలుసుకొని ఆ ఊరికి వెళతాడు. ఈ ప్రయత్నంలో భరత్ కు ఎదురైన పరిస్థితులేంటి.. తన తల్లిదండ్రులను కలుసుకున్నాడా.. అసలు భరత్ వారికి ఎలా దూరమయ్యాడు.. అన్నదే కాశి సినిమా కధ.
కాశి ఎలా ఉందంటే....
మొన్నామధ్య ఈ సినిమా నుంచి ఏడు నిమిషాల వీడియో విడుదల చేశారు. ఇదో కొత్తప్రమోషన్ అనుకున్నాం. కానీ వాళ్లు ముందే హెచ్చరించారు. ఈ ఏడు నిమిషాలు తప్ప సినిమా అంతా బోర్ అని. అది తెలియక వెళ్లారా ఇంక అంతే. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో సినిమా ఆసాంతం పరమ బోరింగ్ సినిమా అనిపించారు. ఆఖర్లో కులాలు, మతమార్పిడులు అంటూ ఏదో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే పూర్తిగా డ్యామేజ్ అయ్యాడు కాశి.
సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో విజయ్ ఆంటోని, ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ కు ఛాన్స్ లేని హీరోయిన్లు.. కాశీ మజిలీ కథల్లా చిరాకు పెట్టిన దర్శకుడు... వెరసి కాశి చిరాకుపెట్టాడు. తక్కువ నిడివితోనే ఎక్కువ టార్చర్ చేశాడు. అసలు వేరే వారి కథల్లోకి హీరోని ‘‘ఊహాత్మకంగా’ పంపించాలనుకున్న దర్శకురాలి ఆలోచనకో దండం పెట్టాలి.. ఈ మొత్తంలో సంగీతం ఫర్వాలేదు. యోగిబాబు కామెడీ కొంతవరకూ రిలీఫ్.