భల్లాలదేవుడి భార్య ఆమేనట

హైదరాబాద్‌: ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు వరకూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయం మీద ఉత్కంఠ నెలకొంది. బాహుబలి-2తో ఆ సందేహం తీరిపోయినా.. కొత్త సందేహం వచ్చేసింది. అదే భల్లాలదేవ భార్య ఎవరన్నది. దీనిపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇంతకుముందు ఈ విషయంపై వేసిన ప్రశ్నలకు రానా దగ్గుబాటి సమాధానమిస్తూ.. సరోగసి విధానంతో ‘భద్ర’ పుట్టాడంటూ సరదాగా బదులిచ్చారు. అయినప్పటికీ అభిమానులను మాత్రం ఆ సమాధానం సంతృప్తి పర్చలేదు. తాజాగా రానా కథానాయకుడిగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ విడుదలైన సందర్భంగా దినేశ్‌ రాజా అనే నెటిజన్‌ రానాని ఓ ప్రశ్న వేశారు. ‘బాహుబలి 2లో మీ భార్య ఎవరు? మీరీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే’ అని రానాకు ట్వీట్‌ చేశాడు. దీనికి రానా.. కాజల్‌ అంటూ సమాధానమిచ్చారు. బుధవారం ఈ ట్వీట్‌ని కాజల్‌ అగర్వాల్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం’ అని ట్వీట్‌ చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాకి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. వీరిద్దరూ చేసిన ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఒకే ప్రశ్నకు రానా ఎప్పటికప్పుడు సరికొత్తగా సమాధానం చెబుతుండటం గమనార్హం.


Leave your comment