మద్యం తాగి వాహనాలు నడపొద్దు

హైదరాబాద్‌: మద్యం తాగిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని సినీ నటుడు అల్లు అర్జున్‌ సూచించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నిర్వహించిన ట్రాఫిక్‌ అవగాహన సదస్సులో అల్లు అర్జున్‌, దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నగర పోలీసు కమిషనర్‌, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రవీందర్‌, డీసీపీ రంగనాథ్‌, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ అవగాహన తనకు ఇష్టమైన అంశమని చెప్పారు. చాలామంది ట్రాఫిక్స్‌ రూల్స్‌ తెలిసినా వాటిని పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం.. మనతో పాటు ఎదుటివారి ప్రాణాలు కాపాడండి’ అని అల్లు అర్జున్‌ సందేశమిచ్చారు. సభ్య సమాజానికి తన వంతు సందేశం ఇస్తున్నానని.. దాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఎంతమంది పోయినా మార్పు రాదా?: రాజమౌళి రోడ్డుప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఏటా 1.40లక్షల మంది చనిపోతున్నా మనలో మార్పు రావడం లేదని సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. సరిహద్దుల్లో శత్రు సైనికుల కాల్పుల్లో మన జవాన్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటేనే మన రక్తం మరిగిపోతుందని.. అలాంటిది ఏలా లక్షల మంది రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే మాత్రం మనలో ఎలాంటి స్పందన ఉండటం లేదన్నారు. దేశం టెక్నాలజీలో దూసుకుపోతున్నా రోడ్డుప్రమాదాల నివారణలో మాత్రం వెనకబడే ఉన్నామని రాజమౌళి అన్నారు. విదేశాల నుంచి అధునాతన బైక్‌లు, కార్లు దిగుమతి చేసుకుంటున్నామని.. అయితే రహదారుల విస్తరణ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మద్యం తాగినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని సూచించారు. ఈ ప్రపంచంలో ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు.


Leave your comment