indian railways

రైల్వే శాఖలో ఉద్యోగ ఖాళీలెన్నో

భారత రైల్వే శాఖలో ఉద్యోగ ఖాళీలెన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

స్పెషల్ డెస్క్- ఇండియల్ రైల్వే శాఖలో (Indian Railway) పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. చాలా కాలంగా భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. రైల్వే శాఖలో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, వీటిలో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే శాఖలో ఖాళీలపై మధ్యప్రదేశ్‌ కు చెందిన సమాచార హక్కు చట్టం (RTI) కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌  అడిగిన ప్రశ్నకు అధికారులు వివరాలు తెలిపారు. 

రైల్వేశాఖలో గ్రూప్‌ సీ కేటగిరీ లోనే 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇందులో రైల్వే సేఫ్టీకి సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ సంవత్సరం జూన్‌ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. భారత రైల్వే శాఖలో మొత్తంగా 3.12 లక్షల నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2022 డిసెంబర్‌లో ప్రకటించారు. 

ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 1.52 లక్షల ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే 1.38 లక్షల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని, వీరిలో 90 వేల మంది చేరినట్టు తెలిపారు. వీటిలో 90 శాతం పోస్టులు సేఫ్టీ కేటగిరీకి చెందినవేనన్నారు. డైరెక్ట్ రిక్రూట్‌ మెంట్, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు నాన్ కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ చెప్పారు.


Comment As:

Comment (0)