సభ్యత్వాల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే: కాంగ్రెస్

news02 March 15, 2018, 4:54 p.m. political

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాల  రద్దు అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పరిపాలన కొనసాగుతోందని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న  ప్రతినిధుల సభ్యత్వాలను రద్దు చేయడానికి కేసీఆర్ ఎవరంటూ జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలహీనపడుతుండటంతో కొత్త ఫ్రంట్ పేరుతో కేసీఆర్ స్టంట్ మొదలుపెట్టారని ఆయన అన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి అసెంబ్లీ నడుపుతున్నారని పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.. ప్రజాసంఘాలు, విద్యార్థుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసినవాళ్లందరూ ఇప్పుడు కేసీఆర్ కు విలన్స్ లాగ కనిపిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఎథిక్స్ కమిటీ సిఫార్సులు లేకుండానే కాంగ్రెస్ నేతలపై ఎలా వేటు వేస్తారని ప్రొ. కోదండరాం విమర్శించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలను పలకరించేందుకు వచ్చిన కోదండరామ్ అసెంబ్లీలో జరిగిన ఘటనపై పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల గొడవ అంశంపై కూడా కమిటీ వేసి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.

మండలి చైర్మన్  స్వామి గౌడ్ కు హెడ్ సెట్ తగిలిందని సభ ఇంతవరకు ఎందుకు ఫుటేజ్  చూపించలేదని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ తన పరిధులు దాటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

 

 

 

tags: jeevanreddy, uttamkumarreddy, pcc, congress, jaipalreddy, kodandaram

Related Post