కొత్త సచివాలయం-అసెంబ్లీ ఎందుకు నిర్మిస్తున్నారు

news02 July 8, 2019, 9:46 p.m. political

uttam

తెలంగాణ సచివాలయాలన్ని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని.. ఖచ్చితంగా కూల్చివేతను అడ్డుకుని తీరుతామని అఖిల పక్షాలు హెచ్చరించాయి. రాష్ట్రంలో కొత్తగా సచివాలయం, అసెంబ్లీ భవనాలను కట్టాల్సిన అవసరమేమొచ్చిందని అఖిల పక్ష నేతలు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజానీకాన్ని కూడగట్టి ఉద్యమించాలని నిర్ణయించారు. జి.వెంకటస్వామి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సచివాలయం కూల్చివేత కొత్త అసెంబ్లీ నిర్మాణంపై అఖిలపక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ జి.వివేక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల నాయకులు, వివిధ స్వఛ్చంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారో, కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించడం ఎందుకో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉన్న భవనాలను కూల్చేసి, కొత్తవి కట్టడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన అన్నారు. 
uttam
పునర్విభజన చట్టం సెక్షన్‌ 8 ప్రకారం రాజధాని పరిధిలోని ప్రభుత్వ, చారిత్రక భవనాలపై గవర్నర్‌కే పూర్తి అధికారం ఉంటుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వాటిని రక్షించే బాధ్యత అయనదేనని చెప్పారు. వాస్తు దోషం ఉంటే సరిదిద్దుకోవాలి తప్ప చారిత్రక కట్టడాలను కూలుస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని, సొంత మూఢ నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల వాస్తవ పరిస్థితులపై వెంట‌నే శ్వేతపత్రం విడుదల చేయాలని  టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్‌ చేశారు. డబ్బు, అధికార మత్తులో సీఎం కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్‌ విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు షబ్బీర్‌ అలీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బలరాం నాయక్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

tags: uttam, pcc chief uttam, uttam fire on kcr, uttam fire on cm kcr , uttam about new secretariat, pcc chief uttam about new secretariat, uttam comments in all party meeting, all party meeting on new secretariat

Related Post