ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం

news02 Jan. 20, 2019, 7:08 a.m. political

assembly

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలంగాణ శాసన సభ, శాసన మండలిని ఉధ్దేశించి ప్రసంగించారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గవర్నర్ అసెంబ్లీకి రాగానే సీఎం కేసీఆర్ తదితరులు స్వాగతం పలికి అసెంబ్లీ లోనికి తోడ్కొని వెళ్లాారు. ఈమేరకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లా సౌకర్యం కల్పించి శుద్ధమైన తాగునీటిని అందించే బృహత్తర పథకం మిషన్‌ భగీరథ అని చెప్పిన నరసింహన్... ఈ పధకం కింద 66 మున్సిపాలిటీలకు, 23 వేల 968 జనావాసాలకు నీళ్లివ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 56 మున్సిపాలిటీలకు, 18 వేల 612 జనావాసాలకు నీరందిస్తున్నామని తెలిపారు. మార్చి చివరికల్లా వంద శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మిషన్ భగీరధ ద్వార నీళ్లందిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరచని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిందని నరసింహన్‌ చెప్పారు. 

assembly

రాబోవు ఐదేళ్లలోనూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన లక్ష్యాలను, ప్రణాళికలను, పథకాలను నిర్దేశించుకుంటూ తమ ప్రభుత్వం పురోగమిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు అందించిన అపూర్వ విజయమే పునాదిగా వారి బతుకుల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ లక్ష్యసాధనకు తమ ప్రభుత్వం పునరంకితమవుతుందని ఉభయసభల సాక్షిగా నిండు విశ్వాసంతో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. అవినీతిరహిత పరిపాలనను అందించడంలో తమ ప్రభుత్వం గొప్ప విజయం సాధించిందన్న గవర్నర్... తత్ఫలితంగా రాష్ట్ర సొంత ఆదాయ వనరులు బాగా పెరిగాయని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో మరే రాష్ట్రానికి సాధ్యం కాని స్థాయిలో ఆర్థిక వృద్ధిని తెలంగాణ సాధించిందని అన్నారు. 2014-18 మధ్యకాలంలో వార్షిక వృద్ధి రేటు 17.17 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 29.93 శాతం సాధించిందని సగర్వంగా తెలియజేస్తున్నానని నరసింహన్ చెప్పారు. 35 నిమిషాలపాటు ప్రసంగించిన గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ముగించారు.

tags: assembly, governor, governor narasimhan, governor speech in assembly, governor narasimhan speecha in assembly, narasimhan speech in telangana assembly

Related Post