సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల‌కుప్ప‌లా మార్చారు

news02 April 6, 2018, 11:35 a.m. political

వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన కేసీఆర్‌ తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తాజాగా సమర్పించిన నివేదిక ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం గణాంకాలతో గారడీ చేస్తోందని, చెప్పేవన్నీ అసత్యాలేనని తేలిపోయిందని ఆయ‌న  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగ్‌ నివేదిక ఆధారంగా చేసుకుని ఉత్తమ్ .. అబద్దాల కేసీఆర్‌ అద్దంలో చూపిన కాగ్  పేరిట వివరణాత్మక పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌ను పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్‌ రూపొందించారు. దానిని ఉత్తమ్‌ వివరిస్తూ.. రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ విధిగా ఆమోదించాలి. అలాంటి బడ్జెట్‌ కేటాయింపులు .. మంజూరు .. వ్యయం సక్రమంగా జరిగిందో లేదో చూడాల్సిన పవిత్రమైన బాధ్యత కాగ్ దన్నారు. అలాంటి కాగ్‌ తాజా నివేదికలో కేసీఆర్‌ పాలనలో ఆర్గనైజింగ్‌ లూటింగ్‌ జరుగుతోందని, మోసాలకు పాల్పడుతోందని, అంకెల గారడీతో జనాన్ని మోసం చేస్తోందని తేలిందని ఉత్తమ్‌ దుయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయానికి అప్పులు మొత్తం 61,711 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. నాలుగేళ్లుగా అప్పులు చేసుకుంటూ పోవడంతో ఈ ఏడాదికి ఆ అప్పుల మొత్తం  అక్షరాలా ఒక లక్షా 80 వేల 238 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది జీఎస్‌టీపీలో 21.39 శాతం కావడం దారుణ అంశమ‌న్నారు ఉత్త‌మ్. కొత్త, పాత రుణాలతో కలిపి మొత్తం 2.21 లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయిందన్నారు.  ఈ రుణ భారాన్ని జిల్లా వారీగా లెక్కిస్తే ఒకో జిల్లాపై అక్షరాల ఏడు వేల కోట్ల రూపాయలు, ఒకో మండంలపై 370 కోట్లు, గ్రామానికి గణాంకాల్ని విశ్లేషిస్తే ఒకో గ్రామంపై 21 కోట్లు, ఒక్కొక్క కుటుంబానికి లెక్కిస్తే 2.65 లక్షలు, సగటు తెలంగాణ పౌరుడిపై 63 వేల 142 రూపాయల అప్పుల భారాన్ని టీఆర్ఎస్‌ సర్కార్‌ మోపిందని వివ‌ర‌ణాత్మ‌కంగా ఆయ‌న ప్రెజెంటేష‌న్ లో వివ‌రించారు. అప్పులు చేయడానికి ముందూ వెనకా ఆలోచించకుండా తప్పులు చేసిన కేసీఆర్‌ సీఎం పదవిలో కొనసాగేందుకు నైతిక అర్హతను ఏనాడో కోల్పోయారని, సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఉత్పాదక రంగాల పేరుతో అప్పులు చేసినా ఫలితాలు మాత్రం ఏమీ కనబడటం లేదని, దీని ప్రభావం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేలా చేసిందని ఉత్తమ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పది రూపాయల రెవెన్యూలో ఒక రూపాయి అప్పులపై వడ్డీకే వెళ్లిపోతోందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు దాదాపు 49 శాతం చెల్లించేందుకు వచ్చే ఏడేళ్లల్లో 56 వేల కోట్లు చెల్లించాల్సివుంటుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం జీఎస్‌టీపీ ప్రకారం 3 శాతం వరకూ అప్పులు చేయవచ్చు. అయితే టీఆర్ఎస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ అంకెలతో ఎఫ్ఆర్‌బీఎం నుంచి అప్పులు చేసే పరిమితి మూడు శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకునేలా చేసిందని తప్పుపట్టారు. దాన్ని కూడా ఉల్లంఘించి 4.3 శాతం అప్పులు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఉత్తమ్‌ విమర్శించారు.

ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పొందేందుకే కేసీఆర్‌ చేశారని ఉత్తమ్‌ తీవ్ర ఆరోపణ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో వాటి వ్యయ్యాన్ని అనూహ్యంగా పెంచేసి కాంట్రాక్టర్ల లబ్ధి పొందేలా చేయడమే కాకుండా టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం 5 లక్షల 89 వేల 380 కోట్లతో అయిదు బడ్జెట్‌ల్ని ప్రవేశపెట్టారని, ఇందులో ఒక్క నీటిపారుదల శాఖ వ్యయం 79 వేల 713 కోట్లు రూపాయలని, ఇది అక్షరాలా 13.5 శాతం బడ్జెట్‌ నిధులని, కాంట్రాక్టర్లు కమీషన్లు ఇచ్చే చోటే ఆ నిధుల్ని వెచ్చించారని ఉత్తమ్‌ విమర్శించారు. ప్రజల కోసం ప్రాజెక్టులు నిర్మాణాలు చేయాలని, అయితే టీఆర్ఎస్‌ మాత్రమే కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన మండిపడ్డారు. విద్య (9,1శాతం), వైద్యం (3.9 శాతమే) కోసం మాత్రం నామమాత్రంగా నిధులు వెచ్చిస్తున్నారని, నీటిపారుదల శాఖలో మాత్రం నిధులు పారిస్తున్నారని ఉత్తమ్‌ నిప్పులు చెరిగారు. వైద్య రంగానికి చాలా తక్కువ మొత్తంలో నాలుగేళ్లల్లో 20 వేల 844 కోట్ల రూపాయల్ని కేటాయించి అందులో ఖర్చు చేసింది ఏడు వేల 421 కోట్లేనని, కేటాయింపులకూ నిధుల మంజూరీకి ఎక్కడా అందికా పొందికా ఉండటం లేదని విమర్శించారు. ప్రతి మండలంలో వంద పడకల ఆస్పత్రి లాంటి హామీ అనారోగ్యానికి గురిచేశారని, బడ్జెట్‌ కేటాయింపులే తక్కువని, కేటాయింపుల్లో కేవలం 35.52 శాతమే వెచ్చించారంటే పేదల వైద్యానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టం అవుతోందన్నారు. ఈ ఏడాది ఆరోగ్యానికి కేవలం 4.7 శాతమే నిధులు కేటాయించారని, ఇది 18 రాష్ట్రాల కంటే తక్కువని చెప్పడానికి సిగ్గుపడాల్సివస్తోందన్నారు.

సీఎంగా కేసీఆర్, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక సలహాదారులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, వీరందరిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 409 సెక్షన్‌ కింద నమ్మకద్రోహానికి పాల్పడిన నేరస్తులుగా కేసులు నమోదు చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. సీఎంగా కేసీఆర్‌ కొనసాగే నైతిక అర్హతను కోల్పోయారు. తక్షణమే కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్‌ గట్టిగా డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ అంకెల గారడీ, విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, తెలంగాణ ప్రజల ప్రజలపై మోతుపుతున్న తలసరి అప్పుల భారం, చేస్తున్న అప్పులు అక్కరకురాకుండా వెచ్చిస్తున్న వైనం, తెలంగాణ భవిష్యత్‌ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బహిరంగ చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్‌ చెప్పారు. కాగ్‌ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ఉత్తమ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

tags: congress powe rpoint presentation on cag report

Related Post