నాడు జగన్ .. నేడు బాబు

news02 June 15, 2019, 10:10 a.m. political

Chandrababu

అమరావతి : విమానాశ్రయాల్లో ప్రతిపక్షనేతలకు తనిఖీలు తప్పనిసరా? గన్నవరంలో శుక్రవారం నిబంధనల ప్రకారమే ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుని ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు చేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు గ‌తం కంటే భిన్న‌మైన ప‌రిస్థితి ఎదురైంది. విజ‌య‌వాడ నుండి హైద‌రాబాద్ వెళ్లే స‌మ‌యంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం లోప‌ల‌కు ఆయ‌న కారును అనుమ‌తించ‌లేదు. సాధార‌ణ ప్ర‌యాణీకుల త‌ర‌హా లోనే చంద్ర‌బాబు సైతం విమానం ఎక్కే ప్రాంతానికి అక్క‌డ సిద్దం చేసిన మామూలు బ‌స్సులో వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు ఎయిర్ పోర్టులో చంద్రబాబుని మెట‌ల్ డిటెక్ట‌ర్లతో త‌నిఖీలు చేసారు. ఆ త‌రువాత సాధార‌ణ ప్రయాణీకుల‌తో క‌లిసి విమానం ఎక్కారు. ఈ ఉదంతంపై టీడీపీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. జెడ్ ప్ల‌స్ వీఐపీ భ‌ద్ర‌త ఉన్న నాయ‌కుడితో ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేదీ అంటూ నిల‌దీస్తున్నారు. అయితే, దీని పైన విమానాయాన శాఖ ఎప్ప‌టి నుండో ఇక విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను అమ‌లు చేస్తోంది. ప్రోటోకాల్ విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో త‌మ సిబ్బందికి స్ప‌ష్టం చేసింది. దాని ప్రకారమే వారు వ్యవహరించారని తెలుస్తోంది.

Chandrababu

ఇప్పుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాదు. ఏపీ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌. అయితే, విమానయాన శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్ర స్థాయి ప్ర‌తిప‌క్ష నేత‌కు ఎలాంటి ప్ర‌త్యేకంగా ప్రోటోకాల్ ఉండ‌దని నిబంధనలు చెబుతున్నాయి. ఆయన ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడే. ఆ తరహాలోనే విమానాశ్ర‌యంలో ట్రీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ సైతం విమానాశ్ర‌యంలో సాధార‌ణ ప్ర‌యాణికుడి త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రించారు.ఆయనను కూడా ఎయిర్ పోర్ట్ సిబ్బంది మామూలుగానే తనిఖీలు చేశారు. నిన్నమొన్నటివరకూ ప్రత్యేక విమానాలు, వీవీఐపీ ట్రీట్ మెంట్ పొందిన చంద్రబాబుకు ఈ తరహా ట్రీట్ మెంట్ నచ్చకపోయి ఉండవచ్చు. పౌర విమానయాన శాఖ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకు ఉండే ప్రాధాన్య‌త విమానాశ్ర‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌కు ఉండ‌ద‌ని తేల్చింది. ప్రొటోకాల్ ప్ర‌కారం డిప్యూటీ సీఎంకు త‌నిఖీలు ఉండ‌వు. అయితే, ప్ర‌తిప‌క్ష నేతను త‌నిఖీ చేసిన త‌రువాత‌నే అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేస్తోంది. టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబుకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఆయన భద్రతకు భంగం కలిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత లో ఉన్నా చంద్రబాబు కు ప్రత్యేక వాహనం అధికారులు కేటాయించక పోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ను చంద్రబాబు కాన్వాయ్ కి పైలెట్ క్లియరెన్స్ తొలగింపు, ట్రాఫిక్ లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతా పరంగా శ్రేయస్సు కాదంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఇదిలా ఉంటే ఇటువంటి నిబంధనలు ఏపీకి మాత్రమే పరిమితం కావని, దేశమంతా ఒకేలా ఉంటాయని విమానయాన శాఖ అధికారులు చెబుతున్నారు. తమకు నేతలు ఎవరైనా, వారి హోదాకు తగ్గ ప్రోటోకాల్ వర్తింపచేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు

Airport security

tags: Airport,Gannavaram airport,CHANDRABABU, JAGAN MOHAN REDDY, AP CM, Security Checking, Babu, LOKESH, TDP, YSRCP, CONGRES, JANASENA, BJP, Shamshabad airport, Vijayawada airport, Delhi airport

Related Post