సస్పెన్షన్ పై కాంగ్రెస్ నేతలు గరం గరం

news02 March 13, 2018, 12:50 p.m. political

అసెంబ్లీలో తమ సభ్యుల్ని సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాలు ధర్నాలు నిర్వహించడంతోపాటుగా కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని నిర్ణయించారు.

సభలో నిన్న జరిగిన ఘటన పెద్ద డ్రామా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సభలో మార్షల్స్ తో తమపై దాడి చేయించారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ లో లోపాలను ఎత్తి చూపుతామనే భయంతోనే తమను సభలో లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ సర్కార్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో తమ సభ్యుల్ని సస్పెండ్ చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని జానారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సస్పెన్షన్ ప్రకటన చేసే ముందు స్పీకర్ తమను వివరణ కోరకపోవడం విచారకరమన్నారు జానారెడ్డి. వారంరోజులుగా పార్లమెంటులో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం విపక్షాలను ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. సస్పెన్షన్ అంశంపై తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తామని జానారెడ్డి తెలిపారు.

 

 

tags: janareddy, pcc, uttamkumarreddy, congress, clp

Related Post