గాంధీభవన్ లో ముగిసిన కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

news02 March 15, 2018, 5:51 p.m. political

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు, నేతల సస్పెన్షన్ నేపథ్యంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు చేపట్టిన 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ముగిసింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లు మాట్లాడారు. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే నల్లగొండ నుంచి పోటీచేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడు, కూతురు ఎవరిని పంపినా తేల్చుకుంటానని సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. కనీసం గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ను గద్దె దించేవరకూ ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నేత సంపత్ దీక్ష ముగింపు సందర్భంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తాను చివరి సారిగా ఎమ్మెల్యేగా మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారాయన. ఎప్పటికీ ఆలంపూర్ ప్రజల గుండెల్లో ఉండిపోతానని ఆయన చెప్పారు. కేసీఆర్ కు దళితులు, రెడ్లు, బీసీలంటే నచ్చదని సంపత్ అన్నారు. టీఆర్ఎస్ లోకి వస్తే తనకు కోట్లు ఇస్తామని ఆశ చూపించారని .. చేరనందుకు తన కుటుంబసభ్యులను ఇబ్బందులు పెట్టారని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చనిపోయినా తన శవంపై కాంగ్రెస్ జెండా కప్పాలని ఆయన చెప్పారు

మరోవైపు ఎమ్మెల్యేల వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ టీ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిల్ వేశారు. స్పీకర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో వేచి చూడాలి.

tags: congress, trs, highcourt, gandhibhavan, komatireddyvenkatreddy, mla

Related Post