Cyclone Biparjoy

ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్‌

ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్‌- విద్యాసంస్థలకు సెలవు- 67 రైళ్లు రద్దు

ముంబయి- బిపోర్‌జాయ్‌ తుపాను ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ (Cyclone Biparjoy) అతితీవ్ర రూపం ధరించి తీరం వైపు వస్తోది. ఇది గుజరాత్‌ (Gujarat)లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద గురువాకం తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. దీంతో గుజరాత్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపధ్యంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించాయి.

సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ లోని కచ్‌, ద్వారక ప్రాంతాల్లో దాదాపు 12వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తుఫాను నేపధ్యంలో జూన్‌ 15 వరకు గుజరాత్‌ లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.

తుపాను ప్రభావం నేపధ్యంలో పశ్చిమ రైల్వే పరిధిలో వందకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో మొత్తం 67 రైళ్లను రద్దు చేయగా, మరో 56 రైళ్ల ప్రయాణాన్ని కుదించారు. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ముంబయి ఎయిర్‌ పోర్టులో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తో ఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.


Comment As:

Comment (0)