Chandrabbau Case

ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన చంద్రబాబు

స్కామ్ తో నాకు సంబంధం లేదు- చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఏసీబీ కోర్టులో (ACB Court) స్వయంగా వాదనలు వినిపించారు. తన వాదనలకు అవకాశమివ్వాలని న్యాయమూర్తిని కోరగా.. అందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. తన అరెస్ట్‌ అక్రమమని, స్కిల్‌ డెవలప్మెంట్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. కేవలం తనపై రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ చేశారని న్యాయమూర్తికి విన్నవించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు మంత్రివర్గం నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు చంద్రబాబు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చామని, రాష్ట్ర శాసనసభ సైతం ఆమోదించిందని చెప్పారు.

అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్‌ చర్యలతో ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్‌ 9 నాటి ఎఫ్‌ఐఆర్‌ లో తన పేరు లేదని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పటి సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో సైతం తన పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదని చంద్రబాబు న్యాయమూర్తికి చెప్పారు. రాష్ట్రంలో పూర్తిగా కక్షసాధింపు పాలన కొనసాగిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగడం లేదన్న ఆయన.. పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆవేధన చెందారు. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్ట్‌ చేశారని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.


Comment As:

Comment (0)