Chandrayaan-3

ఈనెల 14న చంద్రయాన్‌–3 ప్రయోగం

శ్రీహరికోట- భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. చంద్రయాన్‌–3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ISRO) ప్రకటించింది. ముందుగా ఈ నెల 12న ప్రయోగించాలని భావించినా.. ఆ తర్వాత సాంకేతిక సమస్యల కారణంగా 13కు వాయిదా వేసింది. ఆ తరువాత మళ్లీ ఈనెల 14 న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్‌ తెలిపింది.

చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఎదురయ్యే స్వల్ప సాంకేతిక లోపాలను సరిచేసుకోవడంతో పాటు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే ప్రయోగిస్తారని తెలుస్తోంది. అంతకు ముందు 2019 లో చంద్రయాన్‌–2 సైతం జులై 15న ప్రయోగించారు. షార్‌ లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ లో రాకెట్‌ అనుసంధానం పూర్తి చేసి గురువారం ఉదయాన్నే వ్యాబ్‌ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు శాస్త్రవేత్తలు.

మొత్తం110 టన్నుల ద్రవ ఇంధనంతో (ఎల్‌–110) రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం (సీ–25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్‌ను రూపకల్పన చేసింది ఇస్రో. ప్రయోగానికి ముందు తుది విడత మిషన్‌ సంసిద్ధతా సమావేశాన్ని ఈనెల 11న నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్‌ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి చంద్రయాన్-3 ని ఈనెల 14న ప్రయోగిస్తామని ఇస్రో తెలిపింది.

ప్రయోగ సమయంలో ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్‌ 640 టన్నులు బరువు కలిగి వుంటుంది. మొత్తం 3,900 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్‌–3 ఉపగ్రహాన్ని నింగివైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌–3 ఉపగ్రహంలో 2,148 కిలోలు బరువు కలిగిన ప్రపోల్షన్‌ మా డ్యూల్, 1,752 కిలోలు బరువు కలిగిన ల్యాండర్, 26 కిలోలు బరువు కలిగిన రోవర్‌ లను అమర్చి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 60 శాతం పనుల వరకు దేశంలోని 120 ప్రయివేట్‌ పరిశ్రమల సహకారం తీసుకుంది ఇస్రో.


Comment As:

Comment (0)