Chandrayaan-3

ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగనున్న ల్యాండర్‌

చంద్రయాన్-3 సక్సెస్.. విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చంద్రయాన్‌-3

తిరుపతి స్పెషల్ రిపోర్ట్- చంద్రుడి (Moon) పై పరిశోధనల కోసం ఇస్రో (ISRO) తలపెట్టిన చంద్రయాన్‌ 3 (Chandrayaan-3) ప్రయోగంలో మొదటి దశ శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ లో 25:30 గంటల కౌంట్‌ డౌన్‌ ముగిసిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2:35 గంటలకు ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌక ఆకాశంలోకి దూసుకెళ్లింది.  మొత్తం 16.15 నిమిషాల ప్రయాణం తర్వాత.. భూమి చుట్టూ ఉన్న 17036,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్‌-3 వ్యోమనౌకను అది ప్రవేశపెట్టింది. ఈ వ్యోమనౌక చంద్రునిపైకి చేరడానికి సుమారు 41 రోజులు పడుతుంది. ఈ మిషన్‌ను ఇస్రో విజయవంతంగా పూర్తిచేస్తే.. చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాధించిన నాలుగో దేశంగా, చందమామ దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది.

ప్రారంభం నుంచి ఉత్కంఠ రేకెత్తించిన చంద్రయాన్‌-3 ప్రయోగ మొదటి దశ ప్రారంభం నుంచి చివరి వరకు శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే సాగింది. షార్‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు రాకెట్‌ ప్రయాణం ప్రారంభమైంది. ముందు ఎస్‌-200 మోటార్లు మండగా, ఆ తరువాత 108.10 సెకన్లకు ఎల్‌-110 మోటార్లు మండి సరిగ్గా 127 సెకన్లకు ఎస్‌-200 మోటార్లు రాకెట్‌ నుంచి విడిపోయాయి. 194.96 సెకన్లకు పీఎల్‌ఎఫ్‌ విడిపోయింది. 305.56 సెకన్లకు ఎల్‌-110 విడిపోయినట్లు సంకేతాలు అందాయి. 307.96 సెకన్లకు సీ-25 ఇంజిన్‌ మండుకుంది.

954.42 సెకన్లకు సీ-25 ఇంజిన్‌ షట్‌ ఆఫ్‌ అయింది. ఆ తరువాత 969.42 సెకన్లకు చంద్రయాన్‌-3 ఉపగ్రహం రాకెట్‌ నుంచి విడిపోయింది. రాకెట్‌ గమనానికి సంబంధించి ఎప్పటికప్పుడు షార్‌ లోని రెండు గ్రౌండ్‌ స్టేషన్లతో పాటు బెంగళూరు, పోర్టుబ్లెయిర్‌, బ్రూనే, బియాక్‌ గ్రౌండ్‌ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలకు సంకేతాలు అందుతూ వచ్చాయి. చంద్రుడిపై రోవర్‌ ను దించాలన్న ఇస్రో ప్రయత్నానికి ఇది తొలి విజయంగా చెప్పాలి. ఇక ఆగస్టు 23న రోవర్ అనుకున్నట్లే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాంగింగ్ ఐతే ఈ మిషన్ సక్సెస్ అయినట్టే. చంద్రయాన్‌-3 లోని ల్యాండర్‌ ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో దిగనుంది. అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చి పరిశోధనలు చేపడుతుంది.

చంద్రుడి ఉపరితలంపై ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటాను సేకరించడం తోపాటు అక్కడి బిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును చంద్రయాన్‌-3 ప్రయోగం ద్వారా పరిశీలించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్-3 మొదటి దశ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహం ఖచ్చితమైన కక్ష్యలోకి ప్రవేశించి, చంద్రుడి దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టిందని, దాని పరామితులన్నీ సాధారణంగా ఉన్నాయని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ (Somanath) తెలిపారు. ఇక చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ప్రధాని మోదీ (PM Modi) నుంచి మొదలు పలువురు ఇస్రోను అభినందించారు.


Comment As:

Comment (0)